మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే.. మహా రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు.. స్పీకర్ భాస్కర్ జాదవ్ తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో సభ వాయిదా పడింది. ఆదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో స్పీకర్ అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షేలార్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరాగ్ అల్వానీ, హరీశ్ పింపాలే, రామ్ సత్పుతే, విజయ్ కుమార్ రావల్, యోగేశ్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్దియాలపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రెండ్రోజుల వర్షాకాల సమావేశాల నిమిత్తం మహారాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం కాగా.. బీజేపీ ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చించాలంటూ సభలో పట్టుపట్టారు. ఈ సమయంలో సభలో పెద్ద ఎత్తున గలాటా జరిగింది.