ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణంరాజు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 6:29 AM GMT
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ పనులు చేయిస్తోందని ఆరోపించారు నరసాపురం ఎంపీ. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరిగినట్లు తేలితే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తాయని అన్నారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ రఘరామ డిమాండ్ చేశారు.

కొన్ని నెలలుగా తాను వినియోగించే రెండు ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపారు. దీని ద్వారా తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని అర్థమవుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. స్థానిక వైసీపీ నేతల నుండి తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు.

రఘురామ కృష్ణంరాజు గత కొద్దినెలలుగా వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ పార్టీ నేతలపై.. ప్రభుత్వానికి చెందిన పెద్దలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు సెక్యూరిటీ పెంచమని కేంద్రాన్ని కోరగా.. భద్రతను పెంచడం జరిగింది.

Next Story
Share it