ఏ.ఆర్. రెహమాన్ ను తొక్కేయాలని ఓ బ్యాచ్ ప్రయత్నిస్తోందట..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2020 8:17 AM GMTఏ.ఆర్. రెహమాన్.. ఆస్కార్ అందుకున్న మ్యూజిక్ మెజీషియన్..! ఎన్నో భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు.. ఎంతో గొప్ప బ్యాగ్రౌండ్ మ్యూజిక్. కానీ ఆయన బాలీవుడ్ లో చేస్తోంది అతి తక్కువ సినిమాలు మాత్రమే..! దీనిపై ఆయన ఎట్టకేలకు నోరు మెదిపాడు. బాలీవుడ్ లోని ఓ మాఫియా తనకు మంచి మంచి సినిమాలు దక్కకుండా ఎన్నో ప్లాన్ లు వేస్తోందని వెల్లడించాడు. కావాలనే తన గురించి ఏదేదో చెబుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్ లవర్స్, బాలీవుడ్ తన నుంచి చాలా ఆశిస్తోంటే ఓ ముఠా తన దగ్గరకు దర్శక నిర్మాతలను రానివ్వకుండా చేస్తోందని అన్నారు రెహమాన్.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్ పరిశ్రమలో కొందరు పెద్దలు చేస్తున్న చెత్త పనుల గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. సంగీత పరిశ్రమ కూడా మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి వ్యక్తులే చెప్పగా.. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్ లు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ మీద మరో మచ్చ వచ్చి చేరింది.
బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని ఎక్కువగా ఎందుకు కంపోజ్ చేయలేదని రేడియో మిర్చి ఆర్‌జే సురేన్ అడగ్గా.. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఏ.ఆర్. రెహమాన్ సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని ఓ ముఠా చేస్తోందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ బెచారా దర్శకుడు ముఖేష్ ఛబ్రాకు కూడా రెహమాన్‌ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారట కొందరు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్‌లో ఛబ్రాకు పలువురు చెప్పారని.. ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలకు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు వివరించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారాకు రెహమాన్ సంగీతాన్ని అందించారు. సుశాంత్‌కు నివాళిగా రెహమాన్ బృందం వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. సుశాంత్ సినిమాకు రెహమాన్ అందించిన సంగీతం కూడా అందరికీ బాగా నచ్చింది.