సస్పెండ్ చేయనియ్యకండి.. హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 12:31 PM ISTనిన్న మొన్నటి వరకూ వైసీపీ తనపై ఎలా చర్యలు తీసుకుంటుందంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టు మెట్లెక్కారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామపై అనర్హత వేయాలని కోరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున తాను ఎన్నికయ్యాయని, కానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్‌హెడ్‌పై తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారని రఘరామకృష్ణంరాజు వివరించారు. జూన్ 29న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పిటిషన్‌పై.. ఇంకా సమాధానం రావాల్సి ఉందని ఎంపీ పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనపై చర్య తీసుకోవాలంటే.. క్రమశిక్షణా కమిటీ సమావేశం కావాలన్న నిబంధన పాటించలేదన్నారు. అయితే.. కరోనా కారణంగా.. అత్యవసర పిటిషన్లను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ కారణంగా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అంతకుముందు వైసీపీ ఎంపీలతో పాటు కొందరు న్యాయవాదులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర పెద్దలను కలవబోతున్నట్టు వచ్చిన వార్తలపై కూడా రఘురామకృష్ణంరాజు స్పందించారు. వారి ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇన్నాళ్లు సీఎం జగన్‌కు తెలియకుండా నడుస్తోందని భావించానని, ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎంపీలు, న్యాయవాదులను పంపిస్తున్నారంటే.. సీఎం కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.