లాక్‌డౌన్‌ భయం.. ఏపీకి క్యూ కట్టారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2020 10:15 AM GMT
లాక్‌డౌన్‌ భయం.. ఏపీకి క్యూ కట్టారు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ ఉండనుందన్న నేపథ్యంలో సొంత గ్రామాలకు ప్రజలు పయనమయ్యారు. తెలంగాణలో ఉంటున్న ఏపీ వాసులు తమ సొంత ఊళ్లకు వెలుతున్నారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ల వద్ద వాహానాలు బారులు తీరాయి.

కేంద్ర నిబంధనలు ఎలా ఉన్నా.. తమకున్న పరిస్థితులకు అనుగుణంగా తమ రాష్ట్రంలోకి వచ్చే వారు ఎవరైనా సరే.. పాసులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న వేళలో సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెబుతున్నారు. ఏపీకి వచ్చేందుకు అనుమతి పత్రం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం జారీ చేసిన పాసులే అయినా.. నిర్ణీత సమయాల్లోనే రాష్ట్రంలోకి రానిస్తామని చెబుతున్న ఏపీ పోలీస్ బాస్ మాటల ప్రకారం పాసులు ఉన్న వారు ఎవరైనా సరే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య కాలంలోనే ఓకే చెబుతామని స్పష్టం చేస్తున్నారు. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ ఉండటంతో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో వాహనదారులను సరిహద్దుల్లో ఆపేస్తుండగా.. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నారు.

ఈ విషయం తెలియని చాలా మంది పాసులు లేకుండా వెలుతుండడంతో సరిహద్దుల వద్ద బారీగా ట్రాఫిక్‌ జాం అవుతోంది. పాసులు ఉన్న వారిని మాత్రమే ఏపీలోకి అనుమతి ఇస్తున్నారు. లేని వారిని తిరిగి వెనక్కి పంపుతుండడంతో సరిహద్దుల వద్ద పెద్ద సంఖ్యలో వెహికిల్స్‌ బారులు తీరుతున్నాయి. కాగా హైదరాబాద్‌ లాక్‌డౌన్‌పై మరో రెండు రోజుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఎంసెట్, పాలిసెట్, ఐసెట్ , ఈ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్‌సెట్, పీఈ సెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Next Story