తెలంగాణ: కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By సుభాష్  Published on  1 July 2020 6:30 AM GMT
తెలంగాణ: కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లో తగ్గుముఖంగా ఉన్న కేసులు.. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే రాష్ట్రంలో మరో నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇక వైద్యం, అత్యవసర సేలల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆస్పత్రులు, మెడికల్‌ దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 గంటల వరకు తమ కార్యకలాపాలు ముగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 975 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 15,394 కేసులు నమోదు కాగా, 253 మంది మృతి చెందారు. ఇలా రోజురోజుకు రాష్ట్రంలోకరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా నమోదు కావడంతో.. హైదరాబాద్‌ను కఠినమైన లాక్‌డౌన్‌ను మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Next Story