అలా చేయండి : ముస్లీం సోద‌రుల‌కు ఓవైసీ విజ్ఞ‌ప్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 April 2020 12:50 PM GMT
అలా చేయండి : ముస్లీం సోద‌రుల‌కు ఓవైసీ విజ్ఞ‌ప్తి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ‌మ‌య్యింది. క‌రోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో‌ ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. ముస్లిం సోద‌రుల‌ను ఇళ్లలోనే ప్రార్థనలను చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ‌లో కర్ఫ్యూ కార‌ణంగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు బయట తిరిగేందుకు ఎవరినీ అనుమతించరని.. కావున ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఇంటి వద్ద కూడా సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు.

ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం ధర్మమని.. పేదలు ఎవరూ ఆకలితో ఉండకుండా చూడాల‌ని.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులలో ఉన్న బియ్యాన్ని పేద, వలస కూలీలకు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఇక ప్రధాని మోదీ నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ప్రణాళిక లేకుండా విధించారని.. దీని కార‌ణంగా పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. వలస కార్మికులను ఆదుకోవడంలో ప్ర‌భుత్వం విఫలమైందని ఆయ‌న ఆరోపించారు. అంతేకాకుండా.. రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేని వారికి ప్రభుత్వ సహాయం అందలేదని అన్నారు.

క‌రోనా సంక్షోభం కార‌ణంగా సుమారు 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నార‌ని.. ఈ సమస్యను అధిగ‌మించే విధంగా ప్రధాని ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని అన్నారు. అలాగే.. కరోనా పాజిటివ్ నుండి బ‌య‌ట‌ప‌డ్డ వారంతా రెడ్‌క్రాస్‌కు రక్తదానం చేయాలని.. ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను కాపాడటానికి అది స‌హ‌క‌రిస్తుంద‌ని అన్నారు.

Next Story