• పోలీసుల వినూత్న ప్రయత్నం

కరోనా..కరోనా..కరోనా..ఈ మాయదారి మహమ్మారి వైరస్ ఏ ముహూర్తంలో పుట్టిందో గానీ ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తోంది. భారత్ లోకి వైరస్ ప్రవేశించినా ఇక్కడుంటే వేసవి తాపానికి వైరస్ ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ లేదని చెప్పారు కానీ..రోజూ కనిష్టంగా 37 -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా వైరస్ విజృంభిస్తోంది. రోజులు గడిచే కొద్దీ వేలల్లో కేసులు..వందల్లో మరణాలు నమోదవుతున్నారు. బయటికొస్తే వైరస్ సోకుతుందని ఇంట్లోనే ఉండమని లాక్ డౌన్ పెడితే కొందరు ఆకతాయిలు దానిని ఏ మాత్రం లెక్కే చేయటం లేదు. ఉప్పు కోసమని ఒకడు, పాలకూర కోసం ఇంకొకడు, గోధుమపిండి కోసం మరొకడు..కిలోమీటర్ల మీర బండ్లేసుకుని తిరిగేస్తున్నారు. ఉప్పు, పప్పులు ఇంటి చుట్టుపక్కల లేకపోతే కనీసం 3 కిలోమీటర్ల పరిధిలో దొరుకుతాయి. కానీ తమకు కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదని సాకులు చెప్పి మరీ వాటి కోసం ఎంతదూరమైనా వెళ్లిపోతున్నారు.

Also Read : పోలీసుల సడన్ సర్ప్రైజ్.. అవాక్కయిన ఇంటివారు

ఇంకొందరైతే అసలేం పనీ లేకపోయినా ఒక్కో బండి మీద ముగ్గురు, నలుగురు ఎక్కేసి చక్కర్లు కొడుతున్నారు పైగా మాస్కులు కూడా లేకుండా. ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన తమిళనాడు పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. రోడ్డుపై ఏం పని లేకుండా జాలీగా తిరుగుదామని వచ్చేవారిని ఆపి, వాళ్లని బలవంతంగా కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్ లోకి ఎక్కించారు. అంబులెన్స్ లోకి పంపించాక వాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంబులెన్స్ ఉన్న వ్యక్తికి దండాలు పెడుతూ..మమ్మల్ని ముట్టుకోకు. మా వద్దకు రాకూ అంటూ కిటికీల్లోంచి దూకే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ వీడియో చూసిన వారెవరికైనా నవ్వు ఆగదనుకోండి. ఇలా వాళ్లు చేసిన హంగామానంతా పోలీసులే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read : అగ్రరాజ్యంలో అల్లకల్లోలం

నిజానికి అంబులెన్స్ లో ఉన్న వ్యక్తికి కరోనా లేదని, పని లేకుండా బయట తిరగకుండా ఉండేందుకు, వైరస్ ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకే ఇలా అవగాహన వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోను మంచు విష్ణు నెట్టింట్లో షేర్ చేసి పోలీసుల తెలివిని మెచ్చుకుని తీరాలని, వారిని అభినందించాల్సిందే అని పేర్కొన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.