కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2020 12:11 PM ISTకరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి చెందుతూ కునుకులేకుండా చేస్తుంది. ఇక వైరస్ బారినపడి మృతిచెందిన వారి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మృతదేహాల దగ్గరకు సొంతవారు కూడా పోలేని పరిస్థితి. వారి అంత్యక్రియలు చేయలేని దుస్థితి. కరోనా తెచ్చిన ఇంతటి విపత్కర పరిస్థితులలోనూ ఓ ఎమ్మెల్యే కరోనా మృతుడికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
వివరాళ్లోకెళితే.. కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆసుపత్రి, మున్సిపల్ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్ శ్మశాన వాటికలో శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో హాట్ టాఫిక్ అయ్యింది.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 60,797 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,276 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 88 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,209కి చేరింది.