త్వరలో చైనా ఒంటరైపోతుంది: అమెరికా విదేశాంగ మంత్రి
By సుభాష్
భారత్‌తో సరిహద్దు విషయంలో చైనా దూకుడు వ్యవహరిస్తోందని, అందుకు భారత్ కూడా అదే స్థాయిలో బదులిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. గత నెలలో గాల్వన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలు మార్లు మాట్లాడినట్లు ఆయన చెప్పారు. చైనా చాలా దూకుడు వ్యవహరిస్తోందని, అందుకు భారత్ కూడా తన వంతుగా ధీటుగానే బదులిస్తోందని అన్నారు. కాగా, చైనా సరిహద్దుల విస్తరణకు సంబంధించి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
త్వరలోనే షీ జిన్‌పింగ్ పార్టీ నుంచి పొంచివున్న ముప్పును ప్రపంచం అర్థం చేసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. చైనా దేశం త్వరలోనే ఒంటరి అవుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా చర్యలకు సరైన రీతిలో స్పందించేందుకు అన్ని దేశాలు కలిసి వస్తాయని భావిస్తున్నానని అన్నారు.
కాగా, గత నెలలో భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అయితే చైనాకు సంబంధించి 40 మందికిపైగా సైనికులు మృతి చెందారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా.. చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక అప్పటి నుంచి గాల్వన్ లోయలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల కమాండో స్థాయి అధికారులు చర్చలు జరగడంతో చైనా బలగాలు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయాయి. ముందే చిత్తులమారి అయిన చైనా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. అందుకే చైనా ఏ సమయంలోనైనా దూకుడు వ్యవహరిస్తే డ్రాగన్ తోక కత్తిరించేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నట్లు భారత ఆర్మీ వర్గాల ద్వారా సమాచారం.