గుడ్‌న్యూస్ : లాక్‌డౌన్ వేళ‌ మామిడిపండ్ల‌ను మిస్ అవుతున్నా‌రా.? అయితే బుక్ చేసుకోండిలా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2020 2:51 AM GMT
గుడ్‌న్యూస్ : లాక్‌డౌన్ వేళ‌ మామిడిపండ్ల‌ను మిస్ అవుతున్నా‌రా.? అయితే బుక్ చేసుకోండిలా..

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో ఎక్క‌డి జ‌నం అక్క‌డే స్తంభించిపోయింది. బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. బ‌య‌ట ఏం జ‌రుగుతుందో తెలియ‌ని దుస్థితి. ఓ ప‌క్క మార్కెట్లు తెరుస్తున్న గుంపులు గుంపులుగా తిర‌గొద్దంటూ పోలీసుల హెచ్చ‌రికలు వెర‌సి.. లాక్‌డౌన్‌పై ప్ర‌భుత్వ‌ ఉత్త‌ర్వులు పాటిస్తూ అంతా ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. దీంతో వేస‌వి అతిథి మామిడి పండ్ల‌ను బాగానే మిస్స‌య్యేవారున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ఏర్పాటు చేసింది.

లాక్‌డౌన్ వేళ‌ నాణ్యమైన మామిడి పండ్లను ఇంటి వ‌ద్ద‌కే చేరవేసే విధంగా రాష్ట్ర ఉద్యానశాఖ ఓ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. తపాలా శాఖ సౌజన్యంతో.. ఫోన్‌ చేసి ఆర్డర్‌ చేస్తే... 5 కిలోల మామిడి పండ్ల బాక్సును ఇంటి వద్ద‌కే డెలివ‌రీ చేసేందుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నేరుగా తోట నుంచి మామిడి కాయలను సేకరించి, సహజ పద్ధతిలో మాగ బెట్టిన మామిడిపండ్ల‌ను వినియోగదారులకు అందిస్తామని ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి తెలిపారు.

ఇక‌.. 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల కార్టన్‌ బాక్సు ధర రూ. 350(డెలివ‌రీ చార్జీల‌తో క‌లిపి)గా నిర్ణయించారు. దీనిని మే 1వ తేదీ(ఈ రోజు) నుండి ప్రారంభించ‌నున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 79977 24925, 79977 24941 నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్‌ బుక్‌ చేసుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు. ఇదిలావుంటే.. ఈ సేవలు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో ఉన్నవారికే అందిస్తామని క‌మిష‌న‌ర్ తెలిపారు. అయితే.. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత.. జొమాటో, స్విగ్గీ త‌ర‌హాలో వెంట‌నే కాకుండా 4- 5 రోజుల వ్యవధిలో పండ్లు మ‌న‌కు డెలివ‌రీ అవుతాయి.

Next Story
Share it