బాబుకు లాక్‌డౌన్ నిబంధనల చిక్కులు తప్పవా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 1:24 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా రెండు నెలలకు పైనే ఉండటం ఇదే తొలిసారేమో? తెలుగు నేల మీద ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్లుగా ఉండటం ఇప్పటివరకూ ఎదురుకాని అనుభవంగా చెప్పాలి. మాయదారి కరోనా పుణ్యమా అని ఇలాంటి ఎన్నో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాను విపక్ష నేతగా ఉన్న ఏపీకి వెళ్లేందుకు పాసు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అలాంటివేమీ లేకుండా వెళ్లేందుకు కాస్త వెయిట్ చేసినట్లుగా చెబుతారు. కానీ..సాధ్యం కాకపోవటంతో హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉండిపోయారు.
తాను ఏపీకి వెళ్లటానికి కేంద్రాన్ని అనుమతి అడిగిన ఆయన.. తర్వాత తెలంగాణ.. ఏపీ డీజీపీలకు ఈ-పాస్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఆయనకు అనుమతి రావటం.. ఏపీకి బయలుదేరటం జరిగాయి. కాకుంటే.. ఈ మధ్యలో చోటు చేసుకున్న ఒక ఉదంతం పెద్దగా బయటకు రాలేదు. బాబుకు ఇచ్చిన ఈపాస్ తో పాటు.. మరో పత్రాన్ని ఏపీ అధికారులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అందులోని అంశాలు.. రానున్న రోజుల్లో బాబుకు చిక్కులు తెచ్చే అవకాశం ఉంది.
బాబుకు జారీ చేసిన ఈపాస్ తో పాటు.. డీజీపీ రాతపూర్వకంగా జత చేసి మరీ లాక్ డౌన్ మార్గదర్శకాల్ని బాబుకు పంపారు. అందులో లాక్ డౌన్ నిబంధనలు.. అనుసరించాల్సిన అంశాల్ని పేర్కొన్నారు. లాక్ డౌన్ రూల్స్ ప్రకారం 65 ఏళ్లకు పైబడిన వారు.. దీర్ఘకాలిక వ్యాధులుఉన్న వారు ఇంట్లోనే ఉండాలి. మధుమేహం.. రక్తపోటు.. గుండెజబ్బులు ఉన్న వారు.. గర్భిణులు.. పదేళ్ల లోపు చిన్నారులు ఇంటికే పరిమితం కావాలన్నది అందులోని ప్రధాన రూల్.
అంతేకాదు.. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా ఎలాంటి ప్రజారవాణాకు.. ప్రజలు తిరిగేందుకు అనుమతి లేదు. కంటైన్ మెంట్.. బఫర్.. ఆరెంజ్ జోన్ లో ప్రజారవాణా.. వ్యక్తులు ఒకచోట నుంచి మరోచోటకు అదే పనిగా వెళ్లటంపైనా పరిమితులు ఉన్నాయి. అత్యవసరమైతే తప్పించిన మినహాయింపులు ఉండవు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వ్యక్తులు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఏపీకి వెళ్లిన తర్వాత లాక్ డౌన్ నిబంధనల చట్రంలో బాబుకు ఇబ్బందులు తప్పేట్లుగా లేవని చెప్పక తప్పదు.