ఆదేశాలు రావడమే తరువాయి.. ఇంటికే మద్యం సరఫరా..!

By సుభాష్  Published on  18 April 2020 9:09 AM IST
ఆదేశాలు రావడమే తరువాయి.. ఇంటికే మద్యం సరఫరా..!

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌లాన్‌ కొనసాగనుంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూసివున్నాయి. మద్యం బాబులకు ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇంకొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పుడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మద్యం ప్రియులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

ఇక పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కొన్ని చోట్ల మద్యం అమ్మకాలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం తీసున్న విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్‌శాఖ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో అది సాధ్యం కాలేకపోయింది. ముందుగా షాపులు తెరిచే మద్యం విక్రయించాలని నిర్ణయించారు. కానీ షాపుల ద్వారా విక్రయిస్తే జనాలు గుమిగూడి కరోనా వ్యాప్తి ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయని, వైన్స్ షాపుల వల్ల కస్టమర్లు సోషల్ డిస్టెన్స్ పాటించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడింది.

వాస్తవానికి ఏప్రిల్ 8వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక లిక్కర్ లైసెన్స్ ఉన్న షాపులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల ద్వారా మద్యం నేరుగా హోమ్ డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటి నుంచి దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి తప్ప.. ఎలాంటి మద్యం సరఫరా జరగలేదు. జిల్లా యంత్రాంగం అంగీకరిస్తే లిక్కర్ డోర్‌ డెలివరీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎక్సైజ్‌ శాఖలు అంగీకరిస్తే మద్యం డోర్‌ డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉంది బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ముందుగా మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తారని తెలిసిన మద్యం ప్రియులకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. కానీ అది ఆలస్యం కావడంతో కాస్త నిరాశలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు డోర్‌ డెలివరీ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.

అంతా సిద్ధమైతే డోర్‌ డెలివరీ ఎలా చేస్తారు..

అయితే ఇది వరకే ఒక్కో మద్యం షాపునకు మూడు డెలివరీ పాస్‌లను మాత్రమే జారీ అయ్యేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ అంశంపై చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రతీరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యాన్ని సరఫరా చేయనున్నట్లు బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

Next Story