హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2020 5:46 AM GMTహైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్లతో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు..
• జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా క్షేత్రంలోనే ఉండాలని ఆదేశం
• హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
• వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ లకు వరద ప్రభావిత ప్రజల్ని తరలించాలి. వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు వైద్య సదుపాయం కల్పించాలి
• ఇలాంటి క్యాంపుల్లో ప్రస్తుతం బస్తీ దవాఖానలో పని చేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచన
• ప్రస్తుత భారీ వర్షాలకు పెద్దఎత్తున నగరంలో చెట్లు మరియు విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచన
• హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన
• హైదరాబాద్ నగర రోడ్ల పైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్ హొల్స్ వంటి ప్రాంతాల్లో సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలి అధికారులకు ఆదేశం
• ఓపెన్ నాలాల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశం
• వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జీహెచ్ఎంసీ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి.