నా పనితీరుకు మున్సిపల్ ఫలితాలే తీర్పు
By సుభాష్ Published on 12 Jan 2020 10:58 AM GMTముఖ్యాంశాలు
భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం
మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు
చరిత్రలో ఎన్నడు లేనంతగా నిధులు, మౌలిక వసతులు
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై తాను ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోందని రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికలు తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని, అఖండ మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ సంఘాలకు కేటాయించిన నిధులపై స్వేత పత్రం విడుదల చేస్తామని, అందులో పదిశాతం ఇచ్చారా..? అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాలు విసురుతున్నానని అన్నారు. టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కొనలేకే బీజేపీతో కుమ్మక్కైయ్యారని విమర్శించారు. కుట్ర పూరిత రాజకీయాలకు చరమగీతం పాడతామన్నారు.
మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందా.?
రాష్ట్రంలో మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంటారా .? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. మొత్తం 3,148 వార్డుల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. కాగా విపక్షాలు మాకు పోటీనే కాదని, ఒంటరిగా ఎదుర్కొనలేక నిజామాబాద్, జగిత్యాల, రాయికల్, గద్వాల్, వేములవాడ, నారాయణ పేట తదితర స్థానాల్లోకాంగ్రెస్, బీజేపీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
ఏడు నెలల్లోనే వచ్చిన ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు?
ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల్లోనే మళ్లీ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా.. ఈ ఎన్నికలకు నువ్వా.. నేనా అన్నట్లుగా మారింది. ఈ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలుపొందుతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అర్హులైన కొందరికి టికెట్ ఇవ్వకపోపోయినా .. ఏదో ఒక విధంగా వారికి పదవులు కేటాయిచి గౌరవిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాం
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులతో కలిసి ముందుకెళ్తామని, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇస్తూ వారికి బాధ్యతలు అప్పగించామని అన్నారు. ఎమ్మెల్యేలకు ఏ బాధ్యత అప్పగించినా.. వారిపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. టీఆర్ ఎస్ హయాంలో మున్సిపాలిటీలు ప్రగతిసాధించాయని, కొత్త వాటిని ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీల సంఖ్య 62 నుంచి 141కి చేరిందన్నారు. కొత్తగా మరో పది మున్సిపాలిటీలు వచ్చాయన్నారు. సిద్ధిపేట,నిజామాబాద్, ఖమ్మం గ్రేటర్ సంస్థలుగా ప్రారంభమయ్యాయని అన్నారు. మా ప్రభుత్వం హయాంలో ఆదాయం, రెవెన్యూ వసూళ్లు పెంచామని, అలాగే మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
మా హయాంలో కొత్త మున్సిపాలిటీలు
కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు మా హయాంలో ఏర్పాటు చేశామని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఇలాంటి సంస్కృతి లేదని, అవగాహన రాహిత్యంతో హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న నిజాంపేట, నార్సింగ్, మణికొండ, బోడుప్పల్, పుప్పాలగూడలను ఆప్‌గ్రేడ్ చేయకుండా పంచాయతీలుగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఆర్థిక పరిస్థితులు ఏమిటీ..?
మా ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చిందని, రూ. 2500 కోట్ల నిధులు ఇచ్చామని, టీఎప్ యూఐడీసీ ద్వారా వసూలు చేశామని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ కు రూ. 300 కోట్లు, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ రామగుండంలకు రూ. 100 కోట్ల చొప్పున బడ్జెట్‌ను నేరుగా ఇచ్చామని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఎన్ని..? ఆదాయం ఎంత అనేది మేము శ్వేత పత్రం విడుదల చేస్తామని వివరించారు. మేము ఇచ్చిన నిధుల్లో కనీసం 10 శాతంమైన వారు ఇచ్చారా..? అని ఉత్తమ్ కుమార్‌కు సవాల్ విసురుతున్నానని, సవాల్‌ను ఉత్తం స్వీకరించాలన్నారు.
కొత్త మున్సిపాలిటీ చట్టం :
కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని అమలు చేసి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తామన్నారు. ఇక ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని, అత్యుత్తమ పౌరసేవలను అందిస్తామని స్పష్టం చేశారు. కేవలం పాలక మండళ్లకే కాకుండా, పురపాలక, టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో ప్రతి మూడు నెలలకోసారి నేనే సమావేశమై, అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతులిస్తామన్నారు. అందు కోసం తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు స్వీయ ధృవీకరణ చట్టం అమలు చేస్తామన్నారు.
చరిత్రలో ఎన్నడు లేనంతగా నిధులు, మౌలిక వసతులు
చరిత్రలో ఎన్నడు లేనంతగా నిధులు, మౌలిక వసతులు కల్పించామని, అలాగే సంస్కరణలు, విధాన రూపకల్పనలు మా హయాంలో జరిగాయన్నారు. కొత్త పంచాయతీ చట్టం, మున్సిపాలిటీల చట్టాలు వచ్చాయని, ఇక త్వరలో కొత్త రెవెన్యూ చట్టం వస్తోందని అన్నారు. వీటి వల్ల రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయన్నారు. సర్కార్ నుంచి అన్ని సహాయక సహకారాలు ప్రజలకు అందుతుండటంతో వారు సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మరో నాలుగేళ్లుగా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.