రెవెన్యూ అధికార వర్గాల్లో నాగరాజు ప్రకంపనలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2020 10:20 AM ISTకీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీకి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ.. ఆయనపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిఘా పెట్టి.. భారీ డీల్ ను బ్రేక్ చేయటమే కాదు.. రెవెన్యూ శాఖలో లంచం రేంజ్ ఎంతన్న విషయంపై సరికొత్త చర్చకు నాగరాజు తెర తీశారని చెప్పాలి. రూ.1.10కోట్ల మొత్తాన్ని సింగిల్ టేక్ లో లంచంగా తీసుకోవటం.. అది కూడా తహిసిల్దార్ స్థాయి అధికారి అంటే అంత మామూలు విషయం కాదంటున్నారు.
ఒకవేళ.. డీల్ కోసం ఇంత భారీగా సొమ్మును తీసుకుంటే.. ఆయన ఇంట్లోనూ.. కారులోనూ లభ్యమైన క్యాష్ చాలా తక్కువనే చెప్పాలి. గతంలో పలువురు అధికారుల్ని ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకున్నప్పుడు.. వారి ఇళ్లల్లో లభ్యమైన ఆభరణాలు.. క్యాష్ తో పోలిస్తే.. నాగరాజు ఎపిసోడ్ లో తక్కువనే అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. నాగరాజుఎపిసోడ్ ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనల్ని రేపుతోంది. రూ.1.10కోట్ల మొత్తాన్ని తొలివిడత లంచంగా తీసుకుంటున్న వైనం మొత్తం నాగరాజుకేనా? ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని తేలిస్తే.. మరిన్ని కొత్త పాయింట్లు దొరికే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెవెన్యూ శాఖలో నాగరాజు లాంటివారు మధ్యవర్తిగా వ్యవహరిస్తారని.. అసలు అనకొండలు బయటకు రావని చెబుతున్నారు.
53 ఎకరాల భూమి తీరును మార్చటం.. దాన్ని కొందరికి అనుగుణంగా సిద్ధం చేయటం ఒక ఎమ్మార్వో చేయగలిగినా.. పూర్తిగా చేసే అవకాశం లేదంటున్నారు. పైస్థాయిలో ఉండే వారి ఆశీస్సులు.. అండదండలు లేకుంటే ఇంత బరితెగింపు ఖాయంగా ఉంటుందని తెలుస్తోంది. నాగరాజు ఏసీబీకి పట్టబడ్డారన్న విషయం రెవెన్యూ శాఖలోని పలువురు అధికారులకు ఇప్పుడు వణుకుగా మారింది.
ఆయన నోరు విప్పితే రెవెన్యూ శాఖలోని పలు పెద్ద వికెట్లకు ముప్పు తప్పదంటున్నారు. దీంతో.. ఆయన విషయాన్ని మరింత లోతుల్లోకి వెళ్లకుండా.. దొరికిన రూ.1.1కోట్ల మొత్తం వరకు ఇష్యూను పరిమితం చేయాలన్న ఒత్తిళ్లు షురూ అయినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఎపిసోడ్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో.. అనకొండల భాగోతం బద్ధలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.