జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి - సీఎం కేసీఆర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 10:53 AM GMTతెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. మహాకవి దాశరథి పురస్కారం - 2020 ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో రామానుజంకు అందించారు. శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు.
దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు.
రామానుజం మరిన్న రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఆ కార్యక్రమంలో ఎంపీ కె. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రామానుజం ఓ పద్యం రాసి, పాడి వినిపించారు.