టీ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియ‌స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 10:17 AM GMT
టీ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియ‌స్‌

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుద‌ల దృష్ట్యా ప్ర‌భుత్వ తీరుపై హైకోర్టు మ‌రోసారి అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వం స‌రిగా అమ‌లు చేయడం లేద‌ని సీరియ‌స్ అయ్యింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్.. కరోనాకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలు అమ‌లు చేశారా లేదా అని ప్ర‌శ్నించ‌గా.. కరోనా ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా చేస్తున్నామ‌ని సీఎస్ బ‌దులిచ్చారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వ‌ర‌లోనే బులిటెన్‌ విడుదల చేస్తున్నామని సీఎస్ కోర్టుకు వివ‌రించారు.

క‌రోనా చికిత్స‌కు ప్రైవేటు ఆసుప‌త్రులు విచ్చ‌ల‌విడిగా ఫీజులు వ‌సూలు చేస్తూ ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్నా రాష్ట్ర ప్ర‌‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే 50 ప్రైవేటు ఆసుపత్రుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు ఇచ్చింద‌ని.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని సీఎస్ పేర్కొన‌గా.. మ‌రి మిగిలిన హాస్పిట‌ల్స్ ప‌రిస్థితి ఏంటని కోర్టు ప్ర‌శ్నించింది.

ఇదిలావుంటే.. తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 12న బుధ‌‌వారం) 23,303 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,931 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 11 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 86,475కి చేరింది.

ఈ మహమ్మారి బారినపడి ఇప్ప‌టివ‌ర‌కూ 665 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,780మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 63,074కి చేరింది. 22,736 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story