కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ దుమారం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 8:17 AM GMT
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ దుమారం..!

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, సంగీతకారులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భావిస్తోంది. ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ ను అధికారులు పట్టుకోవడంతో కొంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగష్టు 21న బెంగళూరు లోని కళ్యాణ్ నగర్ లోని రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్మెంట్స్ లో 145 ఎండిఎంఏ పిల్స్ ను, 2 లక్షల 20 వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత నికూ హోమ్స్ లో సోదాలు జరపగా 96 ఎండిఎంఏ పిల్స్, 180 ఎల్ఎస్డి బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత ఓ లేడీ డ్రగ్ సప్లయర్ ను దోడగుబ్బిలోని ఆమె ఇంట్లో అరెస్టు చేశారు. ఆమె దగ్గర 270 ఎండిఎంఏ పిల్స్ లభించాయి. ఆమెనే కింగ్ పిన్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మూడు రైడ్స్ లో ఎం.అనూప్, ఆర్.రవీంద్రన్, డి.అనిఖా అనే ముగ్గురిని అరెస్టు చేశామని నార్కోటిక్స్ కంట్రోల్ బీయూరో డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) కెపిఎస్ మల్హోత్రా తెలిపారు.

ప్రాథమిక విచారణలో డ్రగ్స్ ను కర్ణాటకకు చెందిన పలువురు నటులకు, మ్యూజిషియన్స్, కాలేజీ స్టూడెంట్స్, యువకులకు ఇచ్చినట్లు వెల్లడించారని కెపిఎస్ మల్హోత్రా తెలిపారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ ఈ నెలలో రెహమాన్.కె అనే వ్యక్తిని డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉందన్న అనుమానాలతో అరెస్టు చేశారు. రెహమాన్ ఇతర పార్టీలకు, కాలేజీలకు చెందిన విద్యార్థులకు ఎండిఎంఏ పిల్స్ ను అందిస్తూ వచ్చాడు. డైరెక్ట్ గా డబ్బులు తీసుకోకుండా బిట్ కాయిన్స్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది.

ఎండిఎంఏ(methylenedioxy-methamphetamine) దీని ద్వారా మూడ్ లో మార్పులు వస్తాయి.. దీన్ని తీసుకున్న వాళ్ళు మత్తులో జోగాడుతూ ఉంటారు. ఒక్కో పిల్ ధర మార్కెట్ లో 1500 నుండి 2500 వరకూ ఉంటుంది. ఈ డ్రగ్స్ లింక్ లు కన్నడ చిత్ర పరిశ్రమ దాకా చేరడంతో ఏ సెలెబ్రిటీ పేరు వస్తుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.

Next Story
Share it