జడ్జి సోదరుడిపై దాడి కేసు.. చంద్రబాబు వర్సెస్ ఏపీ డీజీపీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sep 2020 10:10 AM GMTజడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. వైసీపీ నాయకులే ఈ దాడులకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, దళితులపై దాడులు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం, చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం రామచంద్రపై దాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై వైకాపా ప్రభుత్వం అనాగరికంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తోందని బాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల వారిపైనే ప్రత్యేకంగా దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా ప్రతిపక్షనేత అభివర్ణించారు.జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది వైసీపీ నేతలే అని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
రాసిన లేఖపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుకు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘటుగా సమాధానం ఇచ్చారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిలో వాస్తవాలకు విరుద్ధంగా చంద్రబాబు లేఖ ఉందంటూ తేల్చి చెప్పారు గౌతమ్ సవాంగ్. ఈ దాడిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండానే, వాస్తవాలను ధృవీకరించకుండానే ఆరోపణలు చేయడం సరికాదని చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు గౌతమ్ సవాంగ్.
రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్ రెడ్డి టీడీపీకి బలమైన అనుచరుడని తమ విచారణలో తేలిందని.. దాడి సమయంలో రామచంద్ర మద్యం సేవించి ఉన్నాడని.. రామచంద్ర చేసిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. సాక్షుల వాంగ్మూలం, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని స్పష్టం చేశారు.
చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే, వాటిని సీల్డ్ కవర్‌లో పంపితే విచారణ చేస్తామన్నారు. నిజాలు తెలుసుకోకుండానే బహిరంగ లేఖలు రాయడం సరికాదన్నారు డీజీపీ. అలా చేస్తే, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందన్నారు.