భార్యపై‌ ఐపీఎస్‌ దాష్టీకం.. విధుల నుండి తప్పించిన‌ సీఎం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2020 9:18 AM GMT
భార్యపై‌ ఐపీఎస్‌ దాష్టీకం.. విధుల నుండి తప్పించిన‌ సీఎం

మధ్యప్రదేశ్‌లోని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గృహహింసకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. భార్యపై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ(ప్రాసిక్యూషన్‌) కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవ‌డంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివ‌రాళ్లోకెళితే.. పురుషోత్తంశర్మ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ(ప్రాసిక్యూషన్‌)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు‌. అయితే.. పురుషోత్తంశర్మ తన భార్యను కొట్టి, కింద పడేసి, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్ర‌స్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ విష‌య‌మై పురుషోత్తంశర్మ కుమారుడు మాట్లాడుతూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న త‌న‌ తండ్రిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందనే ఉక్రోషంతోనే త‌న త‌ల్లిపై దాడికి దిగారని తెలిపారు. ఈ విష‌య‌మై తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు.కొడుకు వ్యాఖ్య‌ల‌పై పురుషోత్తం శర్మ స్పందిస్తూ.. తాను అంతగా హింసిస్తుంటే.. 32 ఏళ్లుగా ఆమె తనతో ఎలా కాపురం చేయగలిగిందో తన కుమారుడు చెప్పాలని అన్నారు. తన ద్వారా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ.. తనను వేధిస్తోందని, తనకు తెలియకుండా ఇంట్లో కెమెరాలు అమర్చిందని పురుషోత్తం శర్మ భార్యపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. పురుషోత్తంశర్మను విధుల నుంచి తప్పించారు.

Next Story
Share it