అలా జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల.. ఇలా మళ్లీ అరెస్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 6:26 AM IST
అలా జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల.. ఇలా మళ్లీ అరెస్ట్..!

జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలోనూ చిక్కుకున్నారు. కడప నుంచి ఆయన తాడిపత్రికి చేరుకునే క్రమంలో భారీ కాన్వాయ్ తరలి వచ్చింది. దీనిపై తాడిపత్రి సీఐ దేవేందర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, జేసీ ఆయనతో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన‌ అనంత‌పురం పోలీసులు జేసీపై ప‌లు సెక్షన్ల కింద‌ కేసులు నమోదు చేశారు.

ప్రభాకర్‌రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదును స్వీకరించడమే కాకుండా వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ వెల్లడించారు. ఈ రెండు కేసుల్లో తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.

ఈ అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపేనని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ అరెస్ట్ జగన్ రాక్షస పాలనకు నిదర్శనం అని విమర్శించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి వంటి వారిని వదిలేశారని, జేసీ కుటుంబ సభ్యులపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఈ అరెస్టులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. నేర స్వభావం ఉన్న జగన్ వంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో చూస్తున్నామని.. కరోనాను కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను అరెస్ట్ చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్వీట్లు చేశారు.

Next Story