చ‌ర్చ‌నీయాంశంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కామెంట్‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 6:14 AM GMT
చ‌ర్చ‌నీయాంశంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కామెంట్‌.!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఏం చేసినా నడిపోయే పరిస్థితి నుంచి.. మరికొన్ని సార్లు చిన్న తప్పులకు సైతం భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ఫ్యామిలీ. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ ఎదుర్కోనంత గడ్డు పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఒకప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా ఉండే జేసీ ఫ్యామిలీకి ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

దాదాపు నెలన్నర తర్వాత కడపజైల్లో నుంచి విడుదలైన ఆయన.. మారని తన తీరుతో 24 గంటల వ్యవధిలోనే జైలుకు వెళ్లటం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చి.. మళ్లీ రిమాండ్ కు వెళ్లే కొద్ది సమయంలోనే ఏపీ రాజధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజధానిగా అమరావతి ఒక్కటే ఉంటుందని.. మూడు రాజధానులు ఉండవన్నారు.

ఒకవేళ ఏపీకి మూడు రాజధానులు చేస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాలు విసిరారు. ఏపీ రాజధానిగా అమరావతి ఒక్కటే వైఎస్ ప్రకటిస్తే.. తాను ఆ పార్టీలో చేరటానికైనా సిద్ధమేనని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న కమిట్ మెంట్ తో ఉంది. బాబు చెప్పినట్లు ఏపీకి ఒక్క రాజధానికి పరిమితం చేయకుండా.. మూడు ప్రాంతాల్లో మూడురాజధానుల్ని డెవలప్ చేయటం ద్వారా.. తమకు తిరుగులేని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నదే జగన్ ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.

ఇలాంటివేళ.. జరుగుతున్న పరిణామాల్ని అంచనా వేయటంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పులో కాలేశారా? అన్నది ప్రశ్నగా మారింది. కాలం కలిసి రానప్పుడు తొందరపడి సవాళ్లు విసిరే ముందు కాస్త ఆలోచిస్తే బాగుండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల దిశగా అడుగులు పడటమే కాదు.. తన కల సాకారం చేసుకోవటం కోసం జగన్ ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని వదిలేసి.. మూడురాజధానులు కాదు.. ఒక్కటే రాజధాని అన్న భ్రమలో జేసీ బ్రదర్ ఉన్నట్లుగా చెప్పాలి. అన్న మాట మీద నిలబడే తత్త్వం ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పేట్లు లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

Next Story