పిల్లలు ఫిదా అయ్యేలా.. సీఎం జగన్ గిఫ్టు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 11:34 AM ISTఇవాల్టి రోజున దేశంలోని రాష్ట్రాల్లో సింహ భాగం సంక్షేమ పథకాలతో పాలనను సాగిస్తున్న సంగతి తెలిసిందే. రొడ్డు కొట్టుడు పథకాల్ని అమలు చేయటం ఎవరైనా చేస్తారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఎవరికేం కావాలన్న విషయాన్ని అర్థం చేసుకొని.. అందుకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకోవటం చాలా తక్కువమందే చేస్తుంటారు. అలాంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుంటారు.
ఆయన అమలు చేసే పథకాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో కనిపించే అంశాలు మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయని చెప్పాలి. పిల్లల్ని స్కూళ్లకు వెళ్లమని అడాగాల్సిన అవసరం లేకుండానే.. ఉన్నత ఆదాయ వర్గం నుంచి మధ్యతరగి పిల్లల వరకు ఉంటారు. కానీ.. దిగువ మధ్యతరగతి.. పేద..నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రం స్కూళ్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. వీరంతా ఎక్కువగా సర్కారీ స్కూళ్లలోనే చదువుతుంటారు.
వారికి తగ్గట్లే వారు వెళ్లే స్కూళ్లు సైతం నీరసంగా.. నిరుత్సాహంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిని సమూలంగా మార్చేందుకు వీలుగా ఏపీ సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు వినూత్నంగా మారుతున్నాయి. స్కూళ్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేయాలన్న లక్ష్యంతో పాటు.. సర్కారీ స్కూళ్లలోనూ ఆంగ్ల బోధన విషయంలోనూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదిలా ఉంటే..సర్కారీ స్కూలుకు వచ్చే విద్యార్థులకు యూనిఫాం.. సరైన పుస్తకాలు.. వాటిని పెట్టుకునేందుకు బ్యాగులు ఉండని వైనం చూస్తుంటాం.
ఇలాంటి వాటికి చెక్ పెట్టటమే కాదు.. రోజు స్కూలుకు వెళ్లాలన్న ఉత్సాహాన్ని కలిగించేలా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. స్కూలుకు వచ్చే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా అందిస్తున్న బ్యాగులు.. చూడముచ్చటగానే కాదు.. పిల్లల్ని విపరీతంగా ఆకర్షించేలా ఉన్నాయి. చూసినంతనే ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి.
మగపిల్లలకు వేరుగా.. ఆడపిల్లలకు వేరుగా రూపొందించటంతో పాటు.. బ్యాగుపై చివరన.. చిన్న అక్షరాలతో జగనన్న విద్యా కానుక అంటూ.. రాసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ప్రభుత్వం నుంచి ఇచ్చే కానుకలు ఏవైనా.. వాడేందుకు వీలుగా లేకపోవటం.. ఒకవేళ ఉన్నా.. అంత ఆకర్షణీయంగా ఉండవు. అందుకు భిన్నంగా ఉన్న ఈ స్కూలు బ్యాగులు పిల్లల్ని ఫిదా అయ్యేలా చేస్తాయని చెప్పక తప్పదు.