భారత్, చైనాలకు అమెరికా షాక్..టారిఫ్‌లు 500 శాతం పెంచే ఛాన్స్!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.

By -  Knakam Karthik
Published on : 8 Jan 2026 9:45 AM IST

International News, America, India, China, Russia Oil, US tariffs, Donald Trump

భారత్, చైనాలకు అమెరికా షాక్..టారిఫ్‌లు 500 శాతం పెంచే ఛాన్స్!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌, చైనా వంటి దేశాలపై అమెరికా విధించే టారిఫ్‌లు 500 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ద్విపాక్షిక ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు.

ఎక్స్‌ (X) వేదికగా స్పందించిన లిండ్సే గ్రాహం, ట్రంప్‌తో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని చెప్పారు. ఈ బిల్లును వచ్చే వారం కాంగ్రెస్‌లో ఓటింగ్‌కు తీసుకురావచ్చని వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే భారత్‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై అమెరికా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్‌ యుద్ధాన్ని కొనసాగిస్తూ నిరపరాధులను హతమారుస్తున్నారని గ్రాహం ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రాంగానికి చమురు ఆదాయం ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా అటువంటి దేశాలను శిక్షించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గతేడాది ట్రంప్‌ భారత్‌పై 25 శాతం పరస్పర టారిఫ్‌తో పాటు రష్యా చమురు కొనుగోలుపై మరో 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో కొన్ని ఉత్పత్తులపై మొత్తం సుంకం 50 శాతం వరకు చేరింది. ఇది భారత్–అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. అదేవిధంగా చైనాపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించగా, దీనికి ప్రతిగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధించింది. తాజా పరిణామాలతో ప్రపంచ వాణిజ్య రంగంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

Next Story