ట్రంప్ ప్ర‌శ్న‌కు కంగుతిన్న పాక్‌ ప్రధాని

ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.

By -  Medi Samrat
Published on : 14 Oct 2025 9:41 AM IST

ట్రంప్ ప్ర‌శ్న‌కు కంగుతిన్న పాక్‌ ప్రధాని

ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆ త‌ర్వాత ప‌క్క‌న నిల‌బ‌డ్డ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను భారతదేశం-పాకిస్తాన్ కలిసి జీవించగలవా? అని ప్ర‌శ్నించారు. ఒక్క‌సారిగా ట్రంప్‌ వేసిన ఈ ప్రశ్నతో పాక్‌ ప్రధాని కంగుతిన్నారు. ఆ త‌ర్వాత భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇరు దేశాలు శాంతి మార్గాన్ని అనుసరించాలని ట్రంప్‌ సూచించారు.

అయితే.. మేలో భారత్-పాకిస్థాన్ సైనిక వివాదాల సందర్భంగా తాను కాల్పుల విరమణకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాన‌ని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ వాదనను భారత్ పదే పదే తోసిపుచ్చింది. ఈ కాల్పుల విరమణ ద్వైపాక్షిక చర్చల ద్వారా కుదిరిందని, బయటి జోక్యం వల్ల కాదని భారత్ చెబుతోంది. రెండు దేశాలపై 200% వరకు సుంకాలు విధిస్తాన‌ని బెదిరించడం ద్వారా 24 గంటల్లో ఉద్రిక్తతను ముగించినట్లు ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు.

ఈజిప్టులోని షర్మ్‌ఎల్‌-షేక్‌లో జరిగిన గాజా శాంతి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. అయితే ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. బదులుగా భారతదేశం నుంచి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపారు. ట్రంప్ వాదనలు, షరీఫ్ సిఫార్సులు ఉన్నప్పటికీ.. భారత్‌-పాకిస్తాన్ మధ్య ఏదైనా ఒప్పందం లేదా కాల్పుల విరమణ ద్వైపాక్షిక చర్చల ఫలితమేనని భారత్‌ తన వైఖరిని స్పష్టంగా చెబుతుంది.

Next Story