భార‌త్ మిత్ర దేశ‌మ‌న్నాడు.. పాక్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.

By Medi Samrat
Published on : 31 July 2025 9:53 AM IST

భార‌త్ మిత్ర దేశ‌మ‌న్నాడు.. పాక్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. దీని కింద ఇరు దేశాలు కలిసి పాకిస్థాన్‌లో 'భారీ చమురు నిల్వలను' అభివృద్ధి చేస్తాయి. గతంలో భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్ మిత్ర‌ దేశమని పేర్కొన్నారు. అయినప్పటికీ, సుంకాలలో ఎలాంటి ఉపశమనాన్ని ప్ర‌క‌టించ‌లేదు.

ఇప్పుడు ట్రంప్ పాకిస్థాన్‌తో చమురు ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు. బహుశా ఏదో ఒక రోజు పాకిస్థాన్ భారత్‌కు చమురు విక్రయించే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. అయితే, ట్రంప్ ఏ చమురు నిల్వల గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలియలేదు.

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఇలా రాశారు, "మేము పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాము. దీని ప్రకారం పాకిస్తాన్, అమెరికాలు కలిసి తమ భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేస్తాయి."

ఈ భాగస్వామ్యానికి ఏ ఆయిల్ కంపెనీ నాయకత్వం వహిస్తుందో ఇంకా నిర్ణయించబడుతోందని కూడా ఆయన చెప్పారు. పాకిస్థాన్ ప్రస్తుతం తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.

కానీ కొన్ని నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ సముద్రంలో భారీ చమురు నిల్వలను కలిగి ఉంది. సాంకేతిక లోపాలు, నిధుల కొరత కారణంగా వీటిని ఇంకా వినియోగించలేకపోయారు. ఈ నిల్వలను పెంపొందించుకునేందుకు పాకిస్థాన్ పెట్టుబడులు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ‘ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు పాకిస్థాన్ భారత్‌కు చమురు విక్రయిస్తుందేమో’ అని ట్రంప్ చమత్కరించారు. ఈ ఒప్పందంపై పాకిస్థాన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

భారత్‌పై 25 శాతం సుంకం (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భారతదేశం నుండి వచ్చే అన్ని వస్తువులపై ఈ సుంకం వర్తిస్తుంది. దీనితో పాటు రష్యా నుండి సైనిక పరికరాలు, ఇంధనం కొనుగోలు చేసినందుకు భారతదేశానికి అదనపు జరిమానా కూడా విధించబడుతుంది. భారతదేశ వాణిజ్య విధానాలను "అత్యంత కఠినమైన మరియు అభ్యంతరకరం" అని ట్రంప్ అభివర్ణించారు.

భారత్‌తో అమెరికా మాట్లాడుతోందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం భారత్‌తో మాట్లాడుతున్నాం.. ప్రపంచంలోనే భారత్‌దే అత్యధిక టారిఫ్‌ అని ఆయన అన్నారు.

వైట్ హౌస్ వాణిజ్య ఒప్పందాలపై చాలా బిజీగా ఉందని, తాను దక్షిణ కొరియా వ్యాపార బృందాన్ని కూడా కలుస్తానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందిస్తూ.. ఈ ప్రకటనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. న్యాయమైన, సమతుల్యమైన మరియు విజయవంతమైన వాణిజ్య ఒప్పందం కోసం గత కొన్ని నెలలుగా అమెరికాతో చర్చలు జరుపుతున్నామని, ఈ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని భారత్ తెలిపింది.

Next Story