ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది. ఆఫ్ఘనిస్తాన్ లోని పక్తికా ప్రావిన్స్ మీద పాక్ విమానాలు బాంబులు విడిచిపెట్టాయి. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 46కు చేరినట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
తూర్పు పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో నాలుగు గ్రామాల మీద జరిపిన దాడుల్లో 46 మంది చనిపోగా మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ దాడులను అనాగరిక చర్యగా తాలిబన్ రక్షణశాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న పర్వత ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయి, ఈ దాడుల్లో శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్థాన్ హెచ్చరించింది.