అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. వాణిజ్య ఒప్పందంపై కుదిరిందా.?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు.
By - Medi Samrat |
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య ఈ భేటీ మలేషియాలో జరిగింది. మలేషియాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరిగింది. జైశంకర్ ఈ సమావేశ చిత్రాలను సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పంచుకున్నారు. 'ఈ ఉదయం కౌలాలంపూర్‌లో మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. మా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చ జరిగిందని వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో జైశంకర్, రూబియోల భేటీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ ఇరువురు నేతల మధ్య ట్రేడ్ డీల్ చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది.
గత వారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై తాజా సమాచారం ఇస్తూ.. భారతదేశం తొందరపడి ఎటువంటి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయదని చెప్పారు. అలాగే వ్యాపార ఎంపికలను పరిమితం చేసే భాగస్వామ్య దేశాల నుండి షరతులను తిరస్కరించదన్నారు. పీయూష్ గోయల్, వాణిజ్య ఒప్పందం స్థితిని సూచిస్తూ.. 'ఇది చాలా స్వల్పకాలిక సందర్భంలో లేదా రాబోయే ఆరు నెలల్లో ఏమి జరగబోతోంది అనే దాని గురించి కాదు' అని అన్నారు. అమెరికాకు ఉక్కు అమ్మడం మాత్రమే కాదు. వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇది సుంకాల గురించి మాత్రమే కాదు.. నమ్మకం, సంబంధాల గురించి కూడా.. వాణిజ్య ఒప్పందాలు కూడా వ్యాపారాలకు సంబంధించినవేనన్నారు.