కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నుండి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సేవలపై నిషేదాన్ని జనవరి 31, 2022 వరకు పొడిగించింది. షెడ్యూల్ చేయబడిన అన్ని విమానాలు డిసెంబర్ 15 నుండి పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం మొదట తెలియజేసింది. అయితే.. Omicron వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల కారణంగా నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కితీసుకుంది. DGCA గురువారం జారీ చేసిన సర్క్యులర్‌లో భారత్ నుండి షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలను 2022 జనవరి 31 వరకు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
అయితే.. ఎంపిక చేసిన రూట్లలో మాత్రం షెడ్యూల్ చేసిన విమానాలను అనుమతించవచ్చని సర్క్యులర్ పేర్కొంది. ఈ నిబంధనలు అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలకు మరియు DGCAచే ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు వర్తించవని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మొదటిసారి లాక్‌డౌన్ విధించిన తర్వాత మార్చి 23, 2020 నుండి దేశంలో షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు నిలిపివేయబడ్డాయి. అయితే.. వందే భారత్ మిషన్ కింద మే 2020 నుండి.. అలాగే జూలై 2020 నుండి ఎంపిక చేసిన దేశాలలో 'ఎయిర్ బబుల్' ఏర్పాట్ల ద్వారా విమానాలు తిరుగుతున్నాయి. US, UK, UAE, ఫ్రాన్స్‌తో సహా 31 దేశాలలో భారత్ విమాన సేవలను కొనసాగిస్తోంది.
ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌తో సహా యూరప్‌లోని దేశాల ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ వారు పాజిటివ్‌గా తేలితే.. నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారు.