ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. హెరాత్‌లోని గుజార్‌గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. స్థానిక సమాచారం ప్రకారం ఈ పేలుడులో 20 మంది మరణించారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ ఎవరు?
ముజీబ్-ఉల్ రెహ్మాన్ అన్సారీ గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ మత గురువు. పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తాలిబాన్‌ల కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అన్సారీ మరణాన్ని తాలిబాన్ చీఫ్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూపు లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు.
తాలిబాన్ ముఖ్యనేత, అఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్ గా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ముల్లా బారాదర్ గురించి వివరాలు వెల్లడించడం లేదు తాలిబాన్ వర్గాలు. పేలుడుకు ముందు మసీద్ ఇమాం ముజీబ్ ఉల్ రెహమాన్, ముల్లా బరాదర్ ను కలిసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రార్థనలకు ఎక్కువ మంది హాజరుకావడంతో ఆత్మాహుతి దాడిలో మరింత ఎక్కువ మంది మరణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.