పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది. కొలంబోకు పాకిస్తాన్ హైకమిషన్ స్వయంగా పంపించిన ప్యాకేజీల గడువు తేదీ ఇప్పటికే గడిచిపోయినట్లు తేలింది. శ్రీలంకలోని వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు పాకిస్తాన్ సాయం చేస్తున్నట్లుగా నటించిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అనేక ప్యాకేజీలపై ఉన్న లేబుల్‌లపై “EXP: 10/2024” అని రాసి ఉంది, ఇటీవలి సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరద సంక్షోభంలో ఉన్న దేశానికి పాకిస్తాన్ గడువు ముగిసిన ఉత్పత్తులను రవాణా చేసిందనే ఆరోపణలు విమర్శలకు కారణమైంది.
ఇక ఆపరేషన్ సాగర్ బంధు కింద, నవంబర్ 28 నుండి భారతదేశం వాయు, సముద్ర మార్గాల ద్వారా 53 టన్నుల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది. శ్రీలంక నుండి 2,000 మందికి పైగా భారతీయులను కూడా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. INS విక్రాంత్, INS ఉదయగిరి, INS సుకన్యతో సహా భారత వైమానిక దళ రవాణా విమానాలు, నేవీ ఓడలలో సహాయాన్ని శ్రీలంకకు పంపారు.