సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్‌లోని ఓ పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరపడంతో ఇప్పటికి 13 మంది మరణించగా.. 20 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను చంపుకున్నాడని తెలుస్తోంది. ఇజెవ్స్క్ రాజధానిగా ఉన్న ఉడ్ముర్టియా ప్రాంతానికి చెందిన గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి ఒక సెక్యూరిటీ గార్డును చంపాడని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
"విద్యా సంస్థకు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఐదుగురు మైనర్లతో సహా తొమ్మిది మంది చనిపోయారు" అని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ టెలిగ్రామ్‌లో అంతకు ముందు ఒక ప్రకటనలో పేర్కొంది. దాడి చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. అతను నాజీ చిహ్నాలతో ఉన్న నల్లటి టాప్ ధరించాడని ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ కూడా వెల్లడించింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.