నాడు శ్రీరాముడు.. నేడు శ్రీనివాసుడు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 1:06 PM ISTకర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా సోషల్‌మీడియాలో ఇప్పుడు హాట్‌టాఫిక్ అయ్యారు. ఆయన నూతన గృహ ప్రవేశం వేడుకలో తీసిన కుటుంబ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. గృహప్రవేశం ఫోటోలు ఏంటి.. వైరల్ అవడం ఏంటి అనుకుంటున్నారా.? అయితే మనసును తాకే ఈ గాథను చదవాల్సిందే..
వివరాళ్లోకెళితే.. భార్య, భర్త ఇద్దరమ్మాయిలతో ఉన్న ఈ ముచ్చటైన నలుగురు కుటుంబసభ్యులు బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో ఫోటోలు దిగారు. కానీ.. విషాదమేమిటంటే ఆ నలుగురిలో ప్రస్తుతానికి ముగ్గురే బ్రతికి ఉన్నారు. పిల్లల తల్లి అయిన శ్రీనివాస్ గుప్తా సతీమణి ఓ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు.
ఇప్పుడు కాదు.. కొన్ని సంవత్సరాల క్రితం.. అయితే ఈ గృహ ప్రవేశ వేడుకలో అకస్మాత్తుగా ఆమె ఎలా ప్రత్యక్షమయ్యారు అని వచ్చిన బంధుమిత్రులు అందరూ అవాక్కయ్యారు. నిశితంగా పరిశీలించి చూస్తే అక్కడ కూర్చున్న సజీవంగా ఉన్న మనిషి కాదు. శ్రీనివాస్ గుప్తా సతీమణి మైనపు బొమ్మ.
భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగ మహానుభావులు.. పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు.. ఉన్న ఈ లోకంలో ఈ శ్రీనివాస గుప్తా గారు సమ్ థింగ్ స్పెషల్..!. గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ పెద్దాయన.
రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే.. నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే తయారు చేయించాడు. చెప్తే గానీ తెలిసేలా లేదు 'ఆమె' కాదు అది 'విగ్రహమ'ని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో కదా.! సోషల్‌మీడియా ద్వారా విషయం తెలుసుకున్న నెటిజన్లు శ్రీనివాస గుప్తాను తమ పొగడ్తలు.. కామెంట్లతో ముంచెత్తుతున్నారు.