విభిన్న ప్రతిభా సౌందర్యశీలి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 9:01 AM GMT
విభిన్న ప్రతిభా సౌందర్యశీలి

పిల్లలు పుట్టగానే పెద్దయ్యాక అలా కావాలి.. ఇలా కావాలి అని తలిదండ్రులు అనుకోవడం సాధారణం. పిల్లలు ఎదిగాక వారి కలల్ని నిజం చేస్తారా? అంటే కచ్చితంగా ఔను అని చెప్పలేం. కానీ ఐశ్వర్యశోరాన్‌ మాత్రం మిస్‌ ఇండియా కావాలన్న అమ్మకలను నిజం చేశారు. మీ కోరిక తీరిందిగా.. ఇక నా దారి వెతుక్కొంటా అంటూ సివిల్స్‌ దిశగా అడుగులేసి విజయం సాధించారు. మోడలింగ్‌.. సివిల్స్‌ రెండూ విభిన్న రంగాలు.. అయితేనేం సంకల్పం దృఢంగా ఉండాలే కానీ అసాధ్యమంటూ ఏదీ ఉండదంటున్న సివిల్స్‌ టాపర్‌ ఐశ్వర్య శోరాన్‌ విజయగాధ ఇలా....

అమ్మకోసం..

పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఆరడుగుల ఐశ్వర్య శోరాన్‌ కరీంనగర్‌లో తెలంగాణ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ అజయ్‌ కుమార్‌ గారాల పట్టి. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఐశ్వర్య తన తల్లితోపాటు ఢిల్లీలో ఉంటున్నారు. తను మొదటి నుంచి చదువుల్లో బాగా రాణించారు. ‘సంస్కృతి స్కూల్‌’లో 97 శాతంతో ఇంటర్‌ పూర్తి చేశారు. అనంతరం శ్రీరామ్‌కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో అర్థశాస్త్రంలో ఆనర్స్‌ పుచ్చుకున్నారు.

ఐశ్వర్య తల్లి మాజీ విశ్వసుందరి. తన కూతురు కూడా తనలా సౌందర్యప్రపంచ మహారాణి కావాలని చిన్ననాటి నుంచే కలలు కన్నారు. తదనుగుణంగానే అమ్మాయిని పెంచారు. సహజంగానే ఐశ్వర్య డిగ్రీ పూర్తవగానే మోడలింగ్‌ రంగంలో ప్రవేశించారు. మనకు ఆశలు ఉన్నట్టే కన్నవారికి మనపై కొన్ని కలలుంటాయి.. వాటిని నిజం చేయాల్సింది మనమేగా అంటున్న ఐశ్వర్య మిస్‌ ఇండియా టైటిల్‌ కోసం సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మిస్‌క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఢిల్లీ టైటిల్‌ కైవశం చేసుకున్నారు.

2015లో ‘మిస్‌ క్యాంపస్‌ ప్రిన్సెస్‌ ఢిల్లీ’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు. మరోవైపు మోడలింగ్‌లో దూసుకుపోతున్నారు. 2016లో తల్లి నిరంతరం నిరీక్షిస్తున్న తరుణం రానే వచ్చింద. ఆ ఏడాది మిస్‌ ఇండియా అందాల పోటీలు షురూ అయ్యాయి. అప్పుడు ఐశ్వర్య వయసు పందొమ్మిదేళ్ళు. పోటీలో వివిధ రౌండ్లు క్లియర్‌ చేసిన ఐశ్వర్యకు టైటిల్‌ రాకపోయినా 21 స్థానంలో నిలిచి తన తల్లి కోరికను కొంతమేరకైనా నిజం చేశారు. 2017లో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌వాక్‌ చేసి అందరి కళ్ళలో మెరుపుతీగలా మెరిసిపోయారు.

తన ఆశయం కోసం..

అమ్మ మనసు తృప్తి చెందాక ఎందుకో ఐశ్వర్య మనసు సివిల్స్‌ వైపు మళ్ళింది. వాస్తవానికి అప్పటికే తను మోడలింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఎన్నో గొప్ప అవకాశాలు తన ముందు క్యూకట్టాయి. బాంబే అమెజాన్‌ లాక్మే లాంటి ఫ్యాషన్‌షోలలో ర్యాంప్‌ చేసి నలుగురి కళ్ళను కట్టిపడేశారు. మోడలింగ్‌ రంగంలో అనుకున్నదానికంటే ఎక్కువగానే ఫోకస్‌ అయ్యారు. సాధారణంగా ఇన్నేళ్ళ శ్రమకు ఫలితం దక్కుతున్నందుకు ఆనందించాలి.. లేదా ఆ రంగంలో తన తిరుగులేని ముద్రను ఇంకా బలపరచుకోవాలి.

అలా చేస్తే ఆమె ఐశ్వర్యా శోరన్‌ ఎందుకవుతారు? తన మనసు పొరల్లో దాగున్న ఓ కోరిక బలీయంగా ముందుకొచ్చింది. అదే సివిల్స్‌ వైపు వెళ్ళాలని. ఈ ఆలోచనే చాలా వింతగానూ విభిన్నంగానూ తోచింది విన్నవా రందరికీ. అమ్మ కల నిజం చేయడానికే అయినా ఈ రంగంలో తనదంటూ ఓ దారి నిర్మించుకున్నప్పుడు ఉన్నపళాన మరో దిశకు మళ్ళడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. కొందరికది దుస్సాహసం అనిపించింది కూడా!

అయితే ఐశ్వర్య ఆలోచనలు వేరు. తను మోడలింగ్‌లో కావలసినంత దూరం నడిచేసింది. కొత్తదనం కావాలంటే మరో దారి వెదుక్కో వాల్సిందే. అదీగాక తను స్కూల్, కాలేజీల్లో బెస్ట్‌ స్కోర్‌ ఇచ్చారు. ప్రజలకు సేవలందించే రంగమైతే మరింత ఆనందంగా ఉంటుంది. జీవితానికో అర్థముంటుందని భావించారు. వెంటనే తండ్రి బాటలోనడిచి ఆర్మీలో వెళితేనో.. బాగుంటుంది. కానీ అక్కడ చాలా పరిమితులు ఉంటాయి. ఎదగడానికి మహిళలకు అవకాశాలున్నా అవి పరిమితం. అందుకే సివిల్స్‌ బెస్ట్‌ అనుకున్నారు.

అన్నీ పక్కన బెట్టి..

నిర్ణయం తీసుకుంటే సరిపోదు.. మనసును మన అలవాట్లను అప్పటిదాకా నడచి వచ్చిన దారిని అన్నిటినీ వదిలేయాలి. ముఖ్యంగా మొబైల్, సోషల్‌ మీడియాలను మరచిపోవాలి. ఐశ్వర్య ఏమాత్రం తడబడకుండా అన్నింటినీ పక్కన పెట్టేశారు. సివిల్స్‌కు కోచింగ్‌ కూడా తీసుకోలేదు. అయితే ఐశ్వర్యకు ఇలాంటి నిర్ణయాలు కొత్త కాదు. తను ఇంటర్‌లో సైన్స్‌ చదివినా డిగ్రీలో కామర్స్‌ తీసుకున్నారు. కష్టపడితే అసాధ్యమేమీ లేదని సివిల్స్‌లో ఏకంగా 93 ర్యాంకు సాధించి తన సత్తా ఏంటో తెలిపారు.

ఐశ్వర్యకు 2018లో ఐఐఎం– ఇండోర్‌లో అవకాశ మొచ్చింది. అయితే అప్పుడు సివిల్స్‌పైనే దృష్టి ఉండటంతో వద్దనుకున్నారు. ఏడాది కూడా ప్రిపేర్‌ కాకుండానే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి తన మనోబలం ఎంటో చెప్పకనే చెప్పారు.

ఐశ్వర్య జీవనప్రస్థానం పరిశీలిస్తే.. ప్రముఖ రచయిత యండమూరి ఓ సభలో ‘ఐశ్వర్యా రాయ్‌ కావాలంటే అందం అర్హత ఉండాలి. కానీ మదర్‌ థెరిస్సా కావాలంటే మనసుంటే చాలు’ అన్న మాటలు గుర్తొచ్చాయి. అయితే ఐశ్వర్యకు అందం, అర్హత అన్నీ ఉన్నా ఎందుకు ఆ రంగం వదలుకున్నారు అంటే.. సమాజానికి సేవలందించాలన్న మదర్‌ థెరిస్సాలాంటి మంచి మనసు ఉండబట్టి అనిపించింది. ఎనీ హౌ కంగ్రాట్స్‌ టు ఐశ్వర్యా శోరాన్‌!!

Next Story