మోదీ అంటేనే విజయాలు.. మరి అపజయాలు ఎందుకు.?

By సుభాష్  Published on  26 Dec 2019 8:11 AM GMT
మోదీ అంటేనే విజయాలు.. మరి అపజయాలు ఎందుకు.?

ముఖ్యాంశాలు

  • జార్ఖండ్‌ ఓటమిపై కారణాలు వెతుకుతున్న కాషాయం

  • జార్ఖండ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా గిరిజనులు

బీజేపీ.. ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ సంవత్సరంలోకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోయాయి. తాజాగా ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం కూడా చేజార్చుకుంది. గతంలో మోదీ చాయ్ వాలాగా పరిచయం చేసుకుని ప్రధాని అయ్యారు మోదీ.

అందరిలో ఆశలు కల్పించి దేశ ప్రధాని అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ సిద్దాంతాలను పక్కనబెట్టేసి ఒక చాయ్ వాలాను సామాన్యుడిని అంటూ ఓట్లు అభ్యర్థించాడు..ప్రధాని అయ్యాడు. మోదీని చూసే దేశ ప్రజలంతా రెండు సార్లు బీజేపీకి అధికారం ఇచ్చారంటూ అతిశయోక్తి కాదు. తొలి ప్రభుత్వంలో నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం, మోదీతో ఢీకొనే ప్రతిపక్ష నేత పెద్దగా ఎవరు లేకపోవడంతో మరోసారి జనాలు మోదీతో పగ్గాలు కట్టబెట్టారు. కాగా, మోదీ అంటేనే విజయాలు. విజయాలు అంటేనే మోదీ. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన బలంతో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. ఒక్కసారి కూడా అపజయం లేకుండా విజయం సాధిస్తూనే ఉన్నారు. అసలు ఓటమి ఎరుగని ధీరుడుగా నిలుస్తున్నారు మోదీ.

కానీ ఇప్పుడు తెలిసింది ఓటమి గురించి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఓటమి చవిచూసింది బీజేపీ. కేవలం 12 నెలల కాలంలోనే చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఓటమి పాలుకాగా, తాజాగా జార్ఖండ్ రాష్ట్రం కూడా దక్కకుండా పోయింది. కర్నాటక లో మాత్రమే సొంతంగా అధికార పగ్గాలు చేపట్టింది. హర్యానాలో అయితే పొత్తుల సంసారం చేస్తోందనే చెప్పాలి. తాజాగా జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మొత్తం 9 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అందులో కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీ దక్కించుకుంది. ఇప్పటి వరకు అఖండి విజయం సాధిస్తూ వస్తున్న మోదీ, ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తగలడంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచనలో పడ్డారు. ఓటమికి గల కారణాలను పార్టీ అన్వేషిస్తోంది.

జార్ఖండ్ లో సవరణలే బీజేపీ కొంపముంచాయా?

తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందనేది ముందుగా గ్రహించలేకపోయింది కాషాయ దళం. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించగా, మొత్తం 65.17 శాతం పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాల్లో 40కిపైగా నియోజకవర్గాల్లో అధిక ఓటర్లు గిరిజనులే. ఓట్ల లెక్కింపు మొదలు నుంచి ముక్తి మోర్చా, కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి దూసుకుపోయింది. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం, యాదవ ఓట్లు అధికంగానే ఉన్నాయి

గిరిజన ప్రాంతాల్లో మావోల ప్రభావం:

ఇంకో వైపు ఈ గిరిజన ప్రాంతాల్లో అధిక శాతం మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగింది. మొత్తం 33 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, 40 సీట్లలో 40 శాతం ఓట్లకు ఈ విడతల్లోనే పోలింగ్ జరిగింది. ఇందులో 20 స్థానాలు ఎస్టీ, సామమాజిక వర్గానికి రిజర్వు కాగా, జార్ఖండ్ లో 26 శాతం వరకు గిరిజన జనాభా కావడం గమనార్హం. కాగా, గత సంవత్సరం సర్కార్ చోటానాగ్ పూర్ టెనన్సీ చట్టంను సవరించడం, సంతల్ పారగణ టెనన్సీ చట్టాన్ని సవరించడాన్ని స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో బీజేపీకి ఎదురుగాలి వీచిందనే చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓటమికి గల కారణాలపై కమల దళం అన్వేషణ:

కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఐదు రాష్ట్రాలు చేజారిపోవడంపై బీజేపీ అంతర్మథనంలో పడిపోయింది. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతోంది. జార్ఖండ్ ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలు సమావేశమై ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తోంది. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అడుగులు వేసేలా చర్యలు చేపడుతోంది. ఏది ఏమైనా ఇక వచ్చే ఎన్నికల నాటికి మోదీ టీమ్ బలం తగ్గుతుందా..? లేక ఏదైన జిమ్మిక్కులు చేసి పెంచేలా చేసుకుంటుందా..? అనేది వేచి చూడాలి.

Next Story
Share it