భారత్‌లో 10 కరోనా హాట్‌స్పాట్లు ఇవే..!

By అంజి  Published on  2 April 2020 2:01 AM GMT
భారత్‌లో 10 కరోనా హాట్‌స్పాట్లు ఇవే..!

ఢిల్లీ: దేశంలో మొత్తం 10 ప్రాంతాలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పింది. గడిచిన 24 గంటల్లోనే 386 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తబ్లీగీ జమాత్‌ ప్రతినిధుల వల్లనే ఈ వైరస్‌ వ్యాప్తి చెందిందని తెలిసింది. కాగా ఆ కార్యక్రమానికి హాజరైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి.

ఇప్పటి వరకు 6 వేల మందిని గుర్తించి.. సుమారు 5 వేల మందిని క్వారంటైన్‌కు తరలించారు. తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడుతో పాటు మిగతా రాష్ట్రాల్లో మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు.

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 1,649కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. తబ్లీగ్‌ జమాత్‌కు చెందిన వారు దేశ వ్యాప్తంగా పర్యటించడం వల్లే కరోనా కేసులు పెరిగాయన్నారు.

కరోనా హాట్‌స్పాట్లు..

1. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలకు కీలక హాట్‌స్పాట్‌గా మారింది.

2. ఈశాన్య ఢిల్లీలోని దిల్షాద్‌ గార్డెన్‌ ప్రాంతంలో సౌదీ అరేబియాకు వెళ్లొచ్చిన మహిళ కరోనా సోకి మరణించింది. ఆమెకు వైద్యం చేసిన వైద్యునికి కరోనా సోకడంతో.. అది ఆ వైద్యుడి భార్యకు కూడా సోకింది.

3.రాజస్థాన్‌లో భిల్వారాలోనే 26 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కరోనా తరహా లక్షణాలతో చనిపోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం 83 మంది కరోనా బాధితులు ఉన్నారు.

4.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కూడా కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. గౌతమబుద్దనగర్‌లో 48 కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు నోయిడాలో 2,046 మంది వైద్యుల పరిశీలన ఉన్నారు.

5. కేరళ రాష్ట్రంలోని పథనంథిట్టలో ఐదుగురు కరోనా బాధితులు ఉన్నారు. మొత్తం 7,254 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

6.దేశంలోనే ఎక్కువగా కరోనా ప్రభావిత జిల్లాల్లో కాసరగోడ్‌ ఒకటి. ఇక్కడ ఇప్పటి వరకు 99 మంది కరోనా బారినపడ్డారు.

7. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్న 73 కేసుల్లో 23 కేసులు అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి. వీరిలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.

8.మహారాష్ట్రలోని కొలివాడ, గొరేగావ్‌ ప్రాంతాలు కూడా కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది.

9.పుణలో 50 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. మరో 2,216 మంది వైద్యుల పరిశీలనలో ఉన్నారు.

10.ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో 19 మందికి కరోనా సోకింది. బుధవారం రోజు ఓ వృద్ధుడు కరోనాతో మరణించాడు.

Next Story