43 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారా ..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2020 5:50 PM GMTఒక్క తుపాకీ కూడా పేలలేదు.. 20 మందికి పైగా భారత జవానులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 జవాన్లు కూడా మరణించారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. భారత్-చైనా సరిహద్దుల్లో గత 45 సంవత్సరాలుగా ఎరుగని వాతావరణం ఇప్పుడు తలెత్తింది.
20 మందికి పైగా భారత జవానులు చనిపోయారని భారత ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. చైనాకు చెందిన 43 మంది చనిపోయారంటూ కథనాలను వెల్లడించారు. కానీ చైనాకు చెందిన అధికారులు ఎవరూ ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. గల్వాన్ వ్యాలీ దగ్గర భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన గొడవలో 43 మంది చైనా సైనికులు చనిపోయారని.. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. చైనా శిబిరాల వద్ద హెలికాఫ్టర్ల రాకపోకలు చాలా ఎక్కువయ్యాయని.. గాయపడిన వారిని తరలిస్తూ ఉన్నారంటూ ఏఎన్ఐ తెలిపింది. భారత సైనికులు 20 మంది చనిపోయారన్న వార్తలు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి.
భారత్ కు చెందిన సైనికులు 17 మందికి పైగా తీవ్రగాయాల కారణంగా మరణించారని భారత ఆర్మీ తెలిపింది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండడంతో.. గాయాల తీవ్రత కారణంగా మరణించారని తెలుస్తోంది. అక్కడి నుండి హెలీకాఫ్టర్ల ద్వారా తీసుకురావడం కష్టం కావడంతో భారత సైనికులు అమరులయ్యారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో అసువులు బాసిన భారత సైనికుల సంఖ్య 20కి చేరింది. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారు అన్నదానిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. భారత ఆర్మీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనను వెలువరించలేదు.