ఓటమితో నిరాశ చెందం, కానీ అలా సఫలమయ్యాం: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రిజల్ట్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

By -  Knakam Karthik
Published on : 14 Nov 2025 3:36 PM IST

Hyderabad News, Jubilee Hills by-election, Congress wins, Naveen Yadav, Brs, Bjp, Ktr

ఓటమితో నిరాశ చెందం, కానీ అలా సఫలమయ్యాం: కేటీఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రిజల్ట్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన నమస్సులందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేశారని కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. ఒక విధంగా ఆమె పోరాటమే చేశారని కొనియాడారు. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైన పాత్రను పోషిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యలను ప్రధానంగా ఎంచుకొని పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో తాము ఎంతో నిజాయతీగా పోరాడామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని ఆయన అన్నారు. వాటి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ప్రచారం ముగిసే వరకు ఒక విధంగా, ముగిసిన తర్వాత మరో విధంగా జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 నుంచి 2023 మధ్య ఏడు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒక్క దాంట్లో కూడా గెలవలేదని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

ప్రజా సమస్యలను, ఆరు గ్యారెంటీలను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళతామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని రకాలుగా కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం పాటించామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌కు ఈ ఉప ఎన్నిక ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలు పెట్టినా దీటుగా ఎదుర్కొని మంచి ఓటింగ్ సాధించామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే విషయమై బెంగాల్‌లో హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో కూడా పదిచోట్ల ఉప ఎన్నికలు రావాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉప ఎన్నికకే కాంగ్రెస్ చాలా కష్టపడిందని, ఇక పదిచోట్ల ఉప ఎన్నికలు వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువస్తారేమోనని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story