హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల చివరి జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు.
ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు.