33 ఏళ్ల కల.. కరోనా తీర్చింది
By తోట వంశీ కుమార్ Published on 31 July 2020 7:42 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఎంతో మంది ఎన్నో రకాలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. కరోనా పుణ్యమా అని ఓ వ్యక్తి 33 ఏళ్లుగా చేస్తున్న సాధించని పని కరోనా చేసి పెట్టింది.
హైదరాబాద్‌కు చెందిన నూరుద్దీన్ వయసు 51 సంవత్సరాలు. గత 33 ఏళ్లుగా ఆయన పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఎంత కష్టపడినా ప్రతి సారీ పాస్ మార్కులకు దగ్గరగా వచ్చి ఆగిపోతున్నాడు. ఎన్ని సార్లు పరీక్షలు రాస్తున్న ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయితే.. కరోనా పుణ్యమా అని అతడు ఎట్టకేలకు పాసైయ్యాడు. ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రయోట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూరుద్దీన్ కూడా పాసైయ్యాడు. దీంతో తన 33 ఏళ్ల కల కరోనా కారణంగా నెరవేరిందని తెగ ఆనందపడిపోతున్నాడు.
1987లో తొలిసారి పదో తరగతి పరీక్షలు రాశాడు నూరుద్దీన్. అన్ని సబ్జెక్టులు పాస్ అయినా.. ఒక్క ఇంగ్లిష్ మాత్రం మిగిలిపోయింది. అప్పటి నుంచి 33 ఏళ్లుగా ఆ ఒక్క పేపర్ పాస్ అయ్యేందుకు గజనీ మహ్మద్‌లాగా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అయితే.. ప్రతి సారీ 32,33 మార్కుల వరకు వస్తున్నాయి. ప్రతి ఏడాది రెగ్యులర్ విద్యార్థిగా ఆప్లై చేస్తూ ఒక్క ఇంగ్లిష్ పరీక్షకు మాత్రమే హాజరవుతూ వచ్చిన నూరుద్దీన్.. ఈసారి సకాలంలో పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయాడు. దీంతో ఓపెన్‌లో అప్లై చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా అతను ఒక్క ఇంగ్లిష్ మాత్రమే కాకుండా మిగిలిన ఆరు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ, ఇక్కడే ఆయనకు కరోనా కలిసొచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాల పరీక్షలన్నీ రద్దు చేయటంతో నూరిద్దీన్‌కు బాగా కలిసొచ్చింది. అన్ని పరీక్షలు వాయిదా వేయటం.. విద్యార్థులందరినీ పాస్ చేయటంతో నూరుద్దీన్ కూడా పది పాసైపోయారు. రెగ్యులర్ వాళ్లకు గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పాస్ చేయగా, ఓపెన్ స్కూల్ విధానంలో అప్లై చేసిన వారికి మాత్రం అందరికీ 35 మార్కులు ఇచ్చి పాస్ చేసేశారు. దీంతో నూరుద్దీన్ అలనాటి కల కరోనా కారణంగా నెరవేరినట్లయింది.