ప్యాంటులో దూరిన పాము.. 7గంటల పాటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 1:56 PM GMT
ప్యాంటులో దూరిన పాము.. 7గంటల పాటు

ఒంటి మీద ఓ చిన్న పురుగు పాకితేనే ఒళ్లంతా జలదరించినట్లు ఉంటుంది. అలాంటిది పాము ఏడు గంటల పాటు ప్యాంటులో ఉంటే.. ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓయువకుడికి పాము ఏడు గంటల పాటు చూక్కలు చూపించింది. కదిలితే ప్రాణం పోతుందని భయపడిన యువకుడు ఓ విగ్రహంలా ఏడు గంటల పాటు నిలుచుకున్నాడు. చివరకు స్థానికుల సాయంతో ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లా జమాల్పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు మరమ్మత్తులు చేపట్టారు అధికారులు. ఆ గ్రామంలోని లవ్లేష్ అనే యువకుడు కూడా విద్యుత్ పనులు చేస్తూ తోటి కార్మికులతో అంగన్‌వాడీ కేంద్రంలో నిద్రపోయాడు. పగలు పనిచేయడం వలన బాగా అలసిపోయి నిద్రపోయాడు. అయితే.. అర్థరాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఓ తాచుపాము అతడి ప్యాంట్‌లోకి దూరింది. మెలుకువ వచ్చి చూసేసరికి ప్యాంట్‌ చివర పామును గమనించాడు. వెంటనే లేచి పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకుని రాత్రంతా కదలకుండా నిలుచుకున్నాడు.

తోటి కార్మికులు పాములు పట్టే వ్యక్తికి పిలిపించారు. అతడు వచ్చి ప్యాంటులోంచి చాకచక్యంగా పాముని బయటకు తీశాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సును కూడా అందుబాటులో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురించి ప్రజలకు తెలియగానే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు కూడా వచ్చి చూసి కార్మికుడి ధైర్యానికి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story