హైదరాబాద్‌లో పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రంలో 3147 కరోనా కేసులు
By సుభాష్ Published on 5 Jun 2020 8:28 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా నిన్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అందరిని దడపుట్టించేలా ఉంది. గడిచిన 24 గంటల్లో 127 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ప్రభుత్వ అధికారులతోపాటు జనాలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా కేసులు నమోదు కావడంపై హైదరాబాద్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇతర దేశాల నుంచి తెలంగాణకు 458 మంది వచ్చారు. వీరిలో 212 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, ఇతర వాహనాల ద్వారా వచ్చిన వారిలో 206 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారిలో అధిక శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వారే ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లోనే కొత్తగా మరో 127 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 3147 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లోనే ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ మొత్తం 105 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 1587 మంది డిశ్చార్జ్ కాగా, 1455 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు జీహెచ్‌ఎంసీలో అధికం
కాగా, తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండటం గమనార్హం. ఇటీవల నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఒక్క జీహెచ్‌ఎంసీలోనే నమోదవుతున్నాయి. అయితే గత మూడు, నాలుగు రోజుల నుంచి ఇతర జిల్లాల్లో కూడా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. అక్కడక్కడ ఒకటి, రెండు చొప్పున మళ్లీ పాజిటివ్ కేసులు మొదలు కావడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గురువారం కొత్తగా నమోదైన 127 కేసుల్లో 110 కేసులు ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.
ఇక హైదరాబాద్‌లో అయితే పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నగర ప్రజలకు రోజురోజుకు ఆందోళన ఎక్కువైపోతోంది. కొందరు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగాయి. నగరంలో కొందరైతే కనీసం మాస్కులు కూడా ధరించకుండా రోడ్లపైకి తిరుగుతున్నారు. పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా.. వారి తీరు ఏ మాత్రం మారడం లేదు. కొన్ని కొన్ని అపార్ట్ మెంట్లను కంటైన్‌మెంట్ జోన్లుగా చేసేశారు. ఒక్కో అపార్ట్‌మెంట్లలోనైతే కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతున్నాయి.
♦ మొత్తం కేసులు – 3147
♦ కొత్త కేసులు 127
♦ కొత్తగా మరణాలు -6
♦ ఇప్పటి వరకూ మృతులు – 105
♦ జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసులు – 110
♦ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య – 1455
♦ ఇప్పటి వరకూ ఇతర దేశాల నుంచి 458 మంది రాగా, అందులో 212 మందికి కరోనా
♦ ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, ఇతర వాహనాల ద్వారా తెలంగాణకు వచ్చిన వారిలో 206 మందికి కరోనా