తెరుచుకోనున్న ఆలయాలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

By సుభాష్  Published on  5 Jun 2020 2:08 AM GMT
తెరుచుకోనున్న ఆలయాలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 5.0 కొనసాగుతోంది. దీంతో అన్ని రంగాలతో పాటు ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇక మూతపడ్డ ఆలయాలు 75 రోజుల తర్వాత మళ్లీ తెరుచుకోనున్నాయి. జూన్‌8వ తేదీ నుంచి ఆలయాలు,ప్రార్థన మందిరాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అందుకు నిబంధనలను సైతం జారీ చేసింది. ఆలయాల వద్ద మరింత స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే..

♦ ముఖద్వారా వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పకుండా ఉండాలి.

♦ కరోనా లక్షణాలు లేకుంటేనే ఆలయాల్లోకి అనుమతి ఇవ్వాలి.

♦ ఆలయాలకు, ప్రార్థన మందిరాలకు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలి

♦ లొపల ఉన్నంత సేపు మాస్కులు, ఫేస్‌ కవర్లు తీయరాదు

♦ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలను వివరించాలి. పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్స్‌ మీడియా ద్వారా తెలియజేయాలి.

♦ చెప్పులు, షూస్‌ వాహనం దగ్గరే వదిలి ఆలయాలకు వెళ్లాలి. లేకపోతే వారికి ప్రత్యేక చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేయాలి.

♦ మందిరాల వద్ద రద్దీని నియంత్రించాలి, భౌతిక దూరం తప్పనిసరి.

♦ వరుస క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

♦ లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వచ్చేందుకు ఒక మార్గం ఏర్పాటు చేయాలి.

♦ భక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.

♦ ఆలయాలకు వెళ్లి భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాలకు తాకరాదు.

♦ ప్రార్థనల సమయంలో ఎవరి మ్యాట్‌ వారే తెచ్చుకోవాలి.

♦ ప్రసాదాలు, తలపై తీర్థ జలాలు చట్టడం నిషేధం.

♦ ప్రార్థన మందిరాలకు, ఆలయాలకు వెళ్లే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

♦ అన్నదానం చేసే సమయంలో సామాజిక దూరం తప్పని సరి.

♦ ఆలయాలు, ప్రార్థన మందిరాలలో పరిశుభ్రత తప్పని సరి.

♦ ఏసీలు, వెంటిలేటర్లను సీపీడబ్ల్యూడీ నిబంధనలకు అనుగుణంగానే వినియోగించాల్సి ఉంటుంది

♦ ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Next Story
Share it