భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో సిటిజెన్‌షిప్ అమెండ్ మెంట్ బిల్లు ప్రవేశపెట్టే తరుణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువుల సంఖ్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి.

2014 కంటే ముందు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు.. తాము ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వచ్చామని నిరూపించుకోగలిగితే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ మూడు దేశాల్లో మైనారిటీలు తగ్గుతున్నారని.. మత విశ్వాసం ప్రాతిపదికన వారు పీడించబడుతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది.

అంతేకాకుండా దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో 23 శాతం ముస్లిమేతరులు ఉండగా, 2011 నాటికి కేవలం 3.7 శాతం మిగిలారని, అలాగే బంగ్లాదేశ్‌లో 1947 నాటికి 22 శాతం ముస్లిమేతరులు ఉండగా 2011 నాటికి 7.8 శాతం మిగిలారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో పేర్కొన్నారు. అయితే అయితే అమిత్ షా వాదనలో ఎంత నిజం వుందో తెలుసుకుందాం.

1951లో ప్రస్తుత పాకిస్తాన్‌లో 1.5 శాతం నుంచి 2 శాతంగా నడుస్తున్న హిందువుల సంఖ్యలో పెద్దగా మార్పులు లేవని గణాంకాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్‌లో 1951లో 22 శాతం నుంచి 23 శాతంగా ఉన్న ముస్లిమేతర జనాభా 2011 నాటికి 8 శాతానికి పడిపోయిందని కూడా జనాభా లెక్కలు సూచిస్తున్నాయి.

1971లో స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్, ఒక లౌకిక రాజ్యంగా ఏర్పడింది. బంగ్లాదేశ్ 1988 వరకు ఒక లౌకిక దేశం. 1988లో ఇస్లాం మతాన్ని అధికారిక మతంగా ప్రకటించారు. ఆ మార్పును రద్దు చేయటానికి సుదీర్ఘంగా జరిగిన న్యాయ పోరాటం.. రాజ్య మతంగా ఇస్లాం కొనసాగాలని బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం 2016లో తీర్పు చెప్పటంతో ముగిసింది.

1998 సెన్సస్ ప్రకారం పాకిస్తాన్ లో 2.1 మిలియన్ హిందు జనాభా ఉన్నారు. అలాగే 2017 సెన్సస్ ప్రకారం పాకిస్తాన్ పూర్తి జనాభా 207 మిలియన్లకి పెరిగినా హిందువుల జనాభా 3 మిలియన్ల వద్ద స్థిరంగా నిలిచింది. కానీ విభజన.. 1971 యుద్ధం తరువాత బాంగ్లాదేశ్‌లోని హిందు జనాభా గణనీయంగా పడిపోయింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.