అయోధ్య మందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేసిన 'అమిత్ షా'

By సుభాష్  Published on  16 Dec 2019 10:25 AM GMT
అయోధ్య మందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేసిన అమిత్ షా

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయోధ్య రామమందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరాన్ని నాలుగు నెలల్లో నిర్మిస్తామని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. తిరుమలకు దీటుగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవాంతరాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికుట్రలు పన్నినా.. మందిరాన్ని కట్టి తీరుతామని చెప్పారు.

కాగా, నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్య కేసుపై తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లీలాకు కేటాయించాలనీ... మసీదు నిర్మాణం కోసం అయోధ్య పరిధిలో ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, అయోధ్య వివాద తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ 18 రివ్యూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా వీటన్నింటిని ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.

Next Story