ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
By సుభాష్ Published on 5 May 2020 1:41 PM ISTఏపీలో ఎప్పుడు రాజకీయాలు వేడెక్కుతూనే ఉంటాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి నోటీసులు పంపింది.
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యల వివరాలు తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
కాగా, వైసీపీ ఎమ్మెల్యేపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కరోనా విస్తరిస్తున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారని, వారిని అడ్డుకోవాలని లాయర్ కిశోర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిల్‌లో ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను చేర్చాలన్నారు.
కాగా, ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారని, సామాజిక దూరం పాటించడం లేదని ఆరోపణలు వినిపించాయి. ఎమ్మెల్యేలు ర్యాలీలు నిర్వహించిన ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కరోనా కేసులు పెరిగాయని ప్రతిపక్షం టీడీపీ నేతలు ఆరోపించారు.