నిహారిక ఎంగేజ్మెంట్ కు పవన్ వెళ్లకపోవడానికి కారణం అదే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 3:56 PM ISTనాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టుగా తెలుస్తోంది. చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు.
ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ సతీసమేతంగా హాజరు కాగా.. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ, సుస్మిత, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరై సందడి చేశారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఇక ఈ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై కూడా పెద్ద చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతూ ఉంది. కొద్దిరోజుల కిందట నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. తన అన్న కూతురు పెళ్ళికి వెళ్లకపోవడానికి విభేదాలే కారణమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉండడమే ఆయన వెళ్లకపోవడానికి కారణమని తెలుస్తోంది. గత నెల ఈ దీక్షను చేపట్టిన పవన్ కళ్యాణ్ నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. ఈ దీక్షలో ఉన్నప్పుడు సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు విడిచి వెళ్లకూడదు. ఎంగేజ్‌మెంట్ రాత్రి పూటే జరగడంతో ఆ వేడుకకు పవన్ హాజరు కాలేకపోయారు. గురువారం ఉదయమే నాగబాబు నివాసానికి వెళ్లి నిహారికను, చైతన్యను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.