కేరళపై వరుణుడి కన్నెర్ర.. ఇడుక్కి జిల్లాలో 13 మంది మృతి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2020 11:57 AM GMTతిరువనంతపురం : కేరళ రాష్ట్రంపై వరుణుడు కన్నెర్ర చేశాడు. భారీ వర్షాలు పడుతుండడంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇడుక్కి జిల్లాలో శుక్రవారం ఉదయం భారీ వర్షం పడింది. కొండచరియలు విరిగిపడడంతో 13 మంది మరణించారు. 12 మందిని రక్షించారు.. గాయపడిన వారికి టాటా జెనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. టూరిస్ట్ ప్రాంతమైన మున్నార్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమలై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 70 నుండి 80 మంది ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం పనిచేయడంలేదు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో స్థానిక బలగాలకు తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.
ఇడుక్కి జిల్లాలో సహాయచర్యలు చేపట్టడానికి 50 మందితో కూడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను పంపామని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పుకొచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాఫ్టర్లను కూడా ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు.
హెల్త్ మినిస్టర్ కెకె. శైలజ ఈ ఘటనపై స్పందిస్తూ.. మొబైల్ మెడికల్ టీమ్, 15 అంబులెన్స్ లను ఇడుక్కికి పంపామని అన్నారు. బాధితులను వెంటనే చేర్చుకోవాలంటూ ఆసుపత్రులకు సూచించారు.
వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కేరళ రాష్ట్రంలోని అన్ని డ్యాముల గేట్లు ఎత్తివేశారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇడుక్కి, మళప్పురం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. కోజికోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం, కన్నూర్, త్రిశూర్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.