బోల్తా పడిన మద్యం లారీ.. బాటిళ్లతో జనం పరుగో పరుగు.. వీడియో వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 10:17 AM GMT
బోల్తా పడిన మద్యం లారీ.. బాటిళ్లతో జనం పరుగో పరుగు.. వీడియో వైరల్

మద్యం లోడుతో వెలుతున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది ఈ విషయం తెలిసిన వెంటనే జనాలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. లారీ డ్రైవర్‌కు సహాయం చేయాల్సింది పోయి.. ఎవరికి దొరికిన బాటిళ్లను వారు ఎత్తికెళ్లిపోయారు. పోలీసులు ఓ వైపు తమ లాఠీలకు పని చెబుతున్నా.. వాటిని ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ ఘటన చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. చతీస్‌గఢ్ ‌రాష్ట్రంలోని కవర్థా రాణిసాగర్ ప్రాంతంలో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారి వెంట బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ కు గాయాలయ్యాయి. మద్యం లారీ బోల్తా పడిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లను ఎంచక్కా ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కవార్ధ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.

డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుందని కవర్దా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి నిమేశ్‌ సింగ్‌ తెలిపారు. లారీలో 100 కార్టన్ల బీరు సీసాలు, 100 కార్టన్ల విస్కీ సీసాలు ఉన్నాయని, రాయ్‌పూర్ నుంచి కవార్ధలోని కౌరా మద్యం దుకాణంలో వీటిని దిగుమతి చేయాల్సి ఉందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ ఖండుజా తెలిపారు. మద్యం సీసాలు తీసుకెళ్లెందుకు గ్రామస్తులు ఎగబడడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. చాలా వరకు సీసాలను గ్రామస్తులు పట్టుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story